Maruti Suzuki | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న సంస్థ..కొత్త ఏడాదిలో నయా మాడళ్లను విడుదల చేయబోతున్నది. ఢిల్లీ వేదికగా జరగనున్న వాహన పండుగలో ఈ కొత్త మాడళ్లను ప్రదర్శిస్తున్నది. వీటిలో తొలి ఎలక్ట్రిక్ వాహనంతోపాటు మూడు ఎస్యూవీ మాడళ్లు
ఉన్నాయి.
వీటి వివరాలు..
మారుతి ఈ-విటారా:దేశీయంగా ఈవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మారుతి కూడా ఈ మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన తొలి ఈ-విటారాను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తున్నది. 49 కిలోవాట్లు, 61 కిలోవాట్లా బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ కారు ధర రూ.22 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. సింగిల్ చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోసిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.
నయా గ్రాండ్ విటారా
కాంప్యాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి నయా గ్రాండ్ విటారాను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వచ్చే ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టనున్న ఈ కారును సరికొత్తగా తీర్చిదిద్దినట్లు,ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్, డ్యాష్‌బోర్డ్, ఐదు-ఏడుగురు కూర్చోవడానికి విధంగా డిజైన్ చేసింది.
కొత్త బాలెనో
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోను మరింత ఆధునీకరించి విడుదల చేయడానికి సిద్ధమైంది మారుతి. మార్చి నెలలో అందుబాటులోకి రానున్న ఈ కారులో అతిపెద్ద టచ్‌స్క్రీన్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే,సింగిల్-ప్యాన్ సన్‌రూఫ్, వైర్లెస్ ఫోన్ చార్జర్, టైర్-ప్రెషర్ మానటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో తీర్చిదిద్దింది.
అప్‌గ్రేడ్ బ్రెజ్జా
మూడేండ్ల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన బ్రెజ్జాను మళ్లీ ఆధునీకరించి మార్కెట్లో విడుదల చేయబోతున్నది సంస్థ. స్కోడా కైలాక్, కియా సైరోస్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఈ నయా మాడల్‌ను తెస్తున్నది.