హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో ఉంచిన సింగరేణికి సంబంధించిన నాలుగు గనులు కూడా తిరిగి సింగరేణికే కేటాయించే అవకాశం ఉన్నదని కంపెనీ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే.. ఈ ఏడాదిలో ప్రారంభం కానున్న ఈ కొత్త గనుల నుంచి 104 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
ఒడిశాలోని నైనీ ఓపెన్ కాస్ట్, కొత్తగూడెం వీకే ఓసీ, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణ గని, గోలేటి ఓసీ నుంచి తీసే బొగ్గు కీలకమని పేర్కొన్నారు. రానున్న మూడేండ్లలో 800 లక్షల టన్నుల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంటామన్న ఆయన.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికను వేగవంతం చేసినట్టు చెప్పారు. కాగా, మరో ఐదేండ్లలో ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థలకు గట్టి పోటీ ఎదురు కానున్నదని, దీనిని ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకోవాలని, ఉత్పాదకతను పెంచుకోవాలని అన్నారు.