ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 19, 2021 , 01:20:39

బిల్లు మోత!

బిల్లు మోత!

  • టెలిఫోన్‌ చార్జీలు పెంచే యోచనలో సంస్థలు

నూఢిల్లీ, ఫిబ్రవరి 18: త్వరలో మొబైల్‌ బిల్లు మోత మోగనున్నదా! అవుననే అంటున్నాయి టెలికం ఇండస్ట్రీ వర్గాలు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన టెలికం సంస్థలకు స్పెక్ట్రం వేలం ఇన్‌స్టాల్‌మెంట్‌, ఏజీఆర్‌ బకాయిలు, త్రైమాసిక ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో మరోదఫా టెలికం చార్జీలు పెంచడానికి రెడీ అవుతున్నాయి. ఏజీఆర్‌ బకాయిల కింద రూ.1.19 లక్షల కోట్లను టెలికం మంత్రిత్వ శాఖకు చెల్లించాలని రెండేండ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,980 కోట్లు చెల్లించగా, వొడాఫోన్‌ ఐడియా రూ.58,254 కోట్లు చెల్లింపులు జరిపాయి. 

మరోవైపు ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం పడిపోవడం కూడా టెలికం సంస్థలకు ఆర్థిక ఇక్కట్లను తెచ్చిపెడుతున్నది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలలకాలంలో ఒక్కో వినియోగదారుడిపై ఎయిర్‌టెల్‌కు రూ.166, రిలయన్స్‌ రూ.151, వొడాఫోన్‌ రూ.121 చొప్పున ఆర్జించాయి. 2019 చివర్లో టెలికం ధరలు పెంచిన కారణంగా గడిచిన కొన్ని త్రైమాసికాలుగా సరాసరిగా ఒక్కో కస్టమర్‌పై వచ్చే ఆదాయం అధికమైందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ అంకిత్‌ జైన్‌ తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికం ధరలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా ఉన్నాయని, సరాసరిగా ఉన్న ధర త్వరలో రూ.220 కి చేరుకుంటున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. మరోవైపు గతేడాది డాటా వినిమయం 40 శాతం పెరిగింది. ఒక్కో మొబైల్‌ల్లోనే 10 వేల పెటాబైట్ల డాటాను వినియోగించారు. ప్రపంచవ్యాప్తంగా జీబీ డాటాకు 5.1 డాలర్లు వెచ్చిస్తుండగా, అదే భారత్‌లో 0.09 డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారు.   

VIDEOS

logo