Nizam Sugar Factory | నిజామాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలైనా అడుగు ముందుకు పడలేదు. పునరుద్ధరణ కోసమంటూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇది చుట్టపు చూపునకే పరిమితమైంది. శ్రీధర్‌బాబుతోపాటు ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఫ్యాక్టరీని సందర్శించారు. రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నదని చెప్పి మళ్లీ తిరిగి రాలేదు. చెరకు రైతులకు పర్చేస్ ట్యాక్స్, రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ట్రాన్స్‌పోర్టు రాయితీ, కొత్త వంగడాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక ఆ తరువాత అడుగు ముందుకు పడలేదు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సైతం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
2015లో ప్రస్తుత యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. దీనిపై చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు కోర్టును ఆశ్రయించారు. తమకు రావాల్సిన వేతనాలపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ తొమ్మిదేండ్లపాటు లేఆఫ్‌లో భాగంగా పని కోల్పోయిన కార్మికుల దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందా? లేదా? అన్నది అనుమానమే. రిటైర్మెంట్ వయసు దాటిన కార్మికుల స్థానంలో కొత్తవారి నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1938లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలో నెలకొల్పారు. నిజాం హయాంలో ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీకి రికార్డులకెక్కింది. శక్కర్నగర్గా పేరొందిన ఈ ప్రాంతమంతా కార్మికులకు చేతి నిండా పనితో, రైతులకు సమృద్ధిగా చెరకు పంటలతో కళకళలాడింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పినప్పుడే యాజమాన్యం 16,395 ఎకరాలు సేకరించింది. రైతులపై ఆధారపడకుండా మిల్లుకు అవసరమైన చెరుకును సొంతంగా సాగు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాగు నీటి కోసం నిజాంసాగర్ జలాశయం సైతం నిర్మించారు. శక్కర్‌నగర్ కేంద్రంగా 20 కిలోమీటర్ల పరిధిలో భూములు విస్తరించగా నిర్వహణకు డివిజన్ల వారీగా 14 ఫారాలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. రూ.కోట్లు విలువ చేసే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఆక్రమణకు గురయ్యాయి. నష్టాల నెపంతో 1996 జూలైలో ప్లాంటేషన్ విభాగాన్ని శాశ్వతంగా మూసివేశారు. అప్పటినుంచి భూముల అమ్మకం మొదలైంది. ప్రభుత్వరంగ కార్పొరేషన్లు, వేలం పాట ద్వారా కలిపి 14,787 ఎకరాలు రైతులకు విక్రయించారు. మిల్లు కార్మికులు 305 ఎకరాలు కొనుగోలు చేశారు. 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బోధన్ చక్కెర కర్మాగారాన్ని నాశనం చేసింది. ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించిన తర్వాత మరికొంత భూమిని తెగనమ్మేశారు.
బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై కార్మికులకు, ఈ ప్రాంత రైతులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పునరుద్ధరణ అంటే ప్రభుత్వమే ఫ్యాక్టరీని చేతుల్లోకి తీసుకొని నడుపుతుందా? ఇప్పుడున్న యాజమాన్యానికే బాధ్యతలు ఇస్తుందా? యాజమాన్యం మార్పును చేపట్టి కొత్తవారికి కట్టబెట్టి ఫ్యాక్టరీని నడిపిస్తారా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతరావడం లేదు. ఫ్యాక్టరీని ఎప్పటిలోగా పునరుద్ధిస్తారు? ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలు పనికి వస్తాయా? కొత్త యంత్రాలు తేవాల్సి ఉంటుందా? అన్నది తేల్చాల్సి ఉన్నది. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే ఉన్నఫళంగా రైతులను చెరకు పంట సాగు వైపు మళ్లించాల్సి ఉంటుంది. అయితే, బోధన్ చుట్టూ 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరకు సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అడుగులు పడకపోవడం గమనార్హం. దీంతో పునరుద్ధరణపై అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతున్నదన్న చర్చ బోధన్‌లో విస్తృతంగా వినిపిస్తున్నది.
నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడంలేదు. 2015 డిసెంబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. ఇది అక్ర మం. అప్పటినుంచి ఇప్పటివరకు కార్మికులకు వేతనాలు రావాలి. వేతన బకాయిలు, నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ పునరుద్ధరణపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కమిటీని వేశారు. ఆ కమిటీ ఏం చెప్పింది? ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రాసెస్ ఏమిటి? నిజాం షుగర్స్‌లోని యూనిట్లను ప్రారంభించేందుకు ఎంత మొత్తం కావాలి? చెరుకు పంట విస్తీర్ణం పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? తదితర విషయాలపై ఎటువంటి వివరణను ప్రభుత్వం ఇవ్వడంలేదు. కమిటీ రిపోర్టును చర్చకు పెడితే క్లారిటీ వస్తుంది.
నిజాంషుగర్స్‌ను పునరుద్ధరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తావించడంతో మాకు నమ్మకం కలిగింది. ఈ నిర్ణయాన్ని తప్పకుండా అమలుచేయాలి. త్వరలో తెరిపించి, మాకు ఉపాధి కల్పించి మా జీవితాలను బాగుచేయాలి.