Cognizant | అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) అనుబంధ కాగ్నిజెంట్ ఇండియా (Cognizant India) కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌లోని తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏండ్లకు పెంచుతున్నట్లు ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ సమాచారంలో తెలిపింది. భారత్‌లోని తమ అనుబంధ సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. సంస్థలో పని చేస్తున్న నిపుణులు, ప్రతిభావంతులను కాపాడుకోవడంతోపాటు మార్కెట్లో ఉన్న నైపుణ్యాన్ని ఆకర్షించడం కోసమే రిటైర్మెంట్ వయస్సు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
పలు ఐటీ సంస్థలు తమ సంస్థల్లో రిటైర్మెంట్ వయస్సు 58 ఏండ్లుగా ఖరారు చేశాయి. వేతనంలో మార్పు లేకుండా రీలొకేట్ అయ్యే ఉద్యోగులకూ దే పాలసీ వర్తిస్తుంది. రిటైర్మెంట్ విధానం ప్రకారం అన్ ఇన్వెస్టెడ్ ఆర్ఎస్యూ, పీఎస్ యూ స్టాక్ అవార్డులను రిటైర్మెంట్ అయిన వెంటనే జప్తు చేశారు. ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుంటే తప్ప ఉద్యోగుల పెన్షన్ ఫండ్ 58 ఏండ్లకు ముగుస్తుంది. కాగ్నిజెంట్ ప్రకటించిన నూతన రిటైర్మెంట్ విధానం గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి వస్తుంది.
కంపెనీ నుంచి అట్రిక్షన్లను నివారించడానికి కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పలు చర్యలు అమలు చేశారు. ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్‌లో వన్‌టైం అదనపు వేతనం పెంపు (కంపెనీ వార్షిక ఇంక్రిమెంట్ సైకిల్ తర్వాత ఒకసారి) అమలు చేశారు. 2022 అక్టోబర్ తర్వాత 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో 13వేల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్‌కు వెనక్కి వచ్చేశారని చెప్పారు. గత ఏడాది కాలంలో అట్రిక్షన్లు 16.2 నుంచి 14.6 శాతానికి తగ్గాయి.