న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ రూ.433. 91 కోట్ల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. అంతక్రితం జూన్ క్వార్టర్లో రుణ వాయిదాల అసలు, వడ్డీ చెల్లింపుల్లో రూ. 440.25 కోట్లు డిఫాల్ట్ అయినట్టు కంపెనీ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలిపింది.
బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, క్యాష్ క్రెడిట్ తదితర రివాల్వింగ్ సదుపాయాల్లో రూ.183.36 కోట్ల అసలు, రూ.5.78 కోట్ల వడ్డీ సెప్టెంబర్ త్రైమాసికంలో చెల్లించలేకపోయింది. ఎన్సీడీలు, ఎన్సీఆర్పీఎస్లు తదితర డెట్ సెక్యూరిటీలకు సంబంధించి రూ.44.77 కోట్ల వడ్డీతో సహా రూ.200 కోట్ల ముఖ విలువ చెల్లింపులో డిఫాల్డ్ అయ్యింది. ఈ డిఫాల్డ్ కారణంగా రుణదాతలు ‘లోన్ రీకాల్’ నోటీసులు ఇచ్చారని, లీగల్ వివాదాలు తలెత్తాయని కాఫీ డే వివరించింది. కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్దార్థ మృతిచెందిన దగ్గర్నుంచి కాఫీ డేకు సమస్యలు మొదలయ్యాయి.