హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్‌సీసీబీ) ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్‌ప్రాసెసింగ్ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నది. తొలివిడతలో రూ.600 కోట్లను వచ్చే రెండేండ్లలో ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రెండో యూనిట్ ఏర్పాటుతోపాటు నీరు, ఘనవ్యర్థాల నిర్వహణలో సామర్థ్యం పెంపు, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాల నిర్మాణం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో హెచ్‌సీసీబీ నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నది.
గురువారం తాజ్‌కృష్ణ హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హెచ్‌సీసీబీ తెలంగాణలో రెండో యూనిట్ ప్రారంభించనుండటం సంతోషంగా ఉన్నదని అన్నారు. రూ.వెయ్యికోట్ల పెట్టుబడి రెండు దశల్లో పెట్టబోతున్న ఈ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 48.53 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. నూతన ఫ్యాక్టరీతో నేరుగా 300 మందికి ఉపాధి లభించనున్నదని, ఇందులో 50 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉండబోతున్నారని తెలిపారు. తెలంగాణకు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలు వచ్చాయని, ప్రభుత్వ విధానాలే దీనికి కారణమని చెప్పారు.
తెలంగాణ నాణ్యమైన మామిడి పండ్ల ఉత్పత్తికి కేంద్రమని, నల్లగొండ, సూర్యాపేట జిలాల్లో ఎక్కువగా బత్తాయి సాగవుతుందని కేటీఆర్ తెలిపారు. వీటి ఆధారంగా జ్యూస్, సంబంధిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని హెచ్‌సీసీబీని కోరారు. కోకాకోలా కూడా ఇన్నోవేషన్ హబ్ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో థనేషియా ఎకోస్ఫెయర్ కంపెనీ ప్లాస్టిక్‌ను టెక్నికల్ టెక్స్‌టైల్స్‌గా మారుస్తున్నదని చెప్పారు. కోకాకోలా ఫ్యాక్టరీలో ప్యాకేజింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌ను ఈ కంపెనీకి ఇస్తే పర్యావరణహిత టెక్స్‌టైల్స్‌గా మార్చే వీలుంటుందని చెప్పారు. వేస్ట్‌వాటర్ మేనేజ్మెంట్లో హెచ్‌సీసీబీ టెక్నాలజీ బాగున్నదని, నీటిని వందశాతం రీసైక్లింగ్ చేసి వాడుతున్నారని పేర్కొన్నారు. ఆ టెక్నాలజీని ఇతర పరిశ్రమలకు నేర్పేందుకు ఒప్పుకోవడాన్ని కేటీఆర్ అభినందించారు.
అమీన్పూర్లో ఇప్పటికే హెచ్‌సీసీబీ బాట్లింగ్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నదని, స్థానిక మున్సిపాలిటీలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నదని కొనియాడారు. మూడో ఎంవోయూలో టాస్క్‌తో కలిసి 10 వేల మంది తెలంగాణ యువతకు వృత్తినైపుణ్యంపై శిక్షణ ఇచ్చేందుకు హెచ్‌సీసీబీ ముందుకురావడం సంతోషంగా ఉన్నదని అన్నారు. తిమ్మాపూర్‌లో కేటాయించిన స్థలంలో పరిపాలన అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పనిలేదని, వెనువెంటనే హెచ్‌సీసీబీ పనులు ప్రారంభించుకోవచ్చని కేటీఆర్ స్పష్టంచేశారు.
తమ కంపెనీకి ఇప్పటికే తెలంగాణలో ఒక యూనిట్ ఉన్నదని, త్వరలో రెండో యూనిట్ ప్రారంభించబోతుండటం సంతోషంగా ఉన్నదని హెచ్‌సీసీబీ చైర్మన్, సీఈవో నీరజ్‌గార్గ్, హెచ్‌సీసీబీ బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబలో రోడ్రిగ్యుజ్ పేర్కొన్నారు. 2023లో నూతన యూనిట్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూల్‌డ్రింక్ ప్రియులు ఇష్టంగా తాగే కోక్, థమ్స్అప్, స్ర్పైట్, లిమ్కా వంటి శీతలపానీయాలు ఇకపై కాళేశ్వరం నీటితో తయారుకానున్నాయి. హెచ్‌సీసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఉత్పత్తులకు వినియోగించుకోనున్నది. బండ తిమ్మాపూర్ ఫుడ్‌ప్రాసెసింగ్ పార్క్‌కు కాళేశ్వరం నీరు అందుబాటులో ఉన్నదని, దాన్ని ఉపయోగించుకొని జ్యూసులు, ప్యాకేజ్డ్ వాటర్, స్పార్కింగ్ బేవరేజెస్ తయారుచేస్తామని హెచ్‌సీసీబీ చైర్మన్, సీఈవో నీరజ్‌గార్గ్ తెలిపారు. కంపెనీ ఉత్పత్తులకు నదులు, కాల్వల్లో పారే నీటినే తీసుకుంటున్నామని, భూగర్భజలాలు వినియోగించబోమని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
థమ్స్‌ప్ 23 బిలియన్ డాలర్ల ప్రొడక్ట్ అని కంపెనీ వర్గాలు చెప్తున్నాయని.. మరో బ్లాక్‌బస్టర్ ప్రొడక్ట్‌ను తయారుచేస్తే తెలంగాణ మంచి వేదిక అవుతుందని కేటీఆర్ అన్నారు. హెచ్‌సీసీబీ బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబలో రోడ్రిగ్యుజ్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు పవిత్ర రంజాన్ మాసంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ హలీం, ధమ్ బిర్యానీని రుచి చూడాలి. ముత్యాలు, దుస్తులు షాపింగ్ చేయాలి’ అని కేటీఆర్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.