న్యూయార్క్, నవంబర్ 7: కో-వర్కింగ్ స్పేస్ సేవల దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా తీసింది. 13 ఏండ్ల క్రితం అమెరికాలో మొదలైన వుయ్‌వర్క్.. 39 దేశాలకు విస్తరించి, 777 చోట్ల తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఆయాచోట్ల 9 లక్షలకుపైగా డెస్కులున్నాయి. 5.47 లక్షల సభ్యులున్నారు. ఈ క్రమంలోనే ఒకానొక దశలో సంస్థ విలువ 47 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4 లక్షల కోట్లు)గా నమోదైంది.
అయితే 2019లో ఐపీవోకు ప్రయత్నించి విఫలమైంది. అప్పట్నుంచే సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అప్పటికే కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోవడం గమనార్హం. 2021 అక్టోబర్‌లో ఐపీవో విజయవంతమైనా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దివాలా చట్టం కింద రుణాల పునర్వ్యవస్థీకరణకు వెళ్తున్నది. సోమవారం న్యూజెర్సీలోని డిస్ట్రిక్ట్ కోర్టులో చాప్టర్ 11 బ్యాంక్రప్టసీ కింద రక్షణను కోరుతూ పిటిషన్ వేసింది.
కరోనా దెబ్బ
కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు వర్క్‌ఫ్రం హోం దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఫీస్ మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా క్షీణించింది. అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర అన్ని దేశాలు, ఖండాల్లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇంచుమించుగా స్తంభించిపోయింది.
ఈ పరిణామం వుయ్‌వర్క్ బిజినెస్‌ను భారీగా దెబ్బతీసింది. దీంతో సంస్థపై రుణభారం కూడా తీవ్రతరమైంది. మరోవైపు మేనేజ్మెంట్ నిర్ణయాలూ సంస్థను మరింత నష్టపరిచాయి. ముఖ్యంగా ఇతర సంస్థల కొనుగోళ్లు లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టాయి. ఎక్కువ ధరపెట్టి కొనడం వాటాదారులకు ఏమాత్రం రుచించలేదు. ఈ నేపథ్యంలోనే సంస్థలోని మెజారిటీ భాగస్వాములు.. అప్పుల్ని తగ్గించుకోవాలని, అలాగే సంస్థకున్న కమర్షియల్ ఆఫీస్ లీజ్ పోర్ట్‌ఫోలియోనూ మదించాలని పట్టుబట్టారు. దీంతో దివాలా ప్రక్రియే దారైంది.
Weworklogo
భారత్‌పై ప్రభావం లేదు
వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా.. వుయ్‌వర్క్ ఇండియాపై ఏ రకంగానూ ప్రభావం చూపబోదని, ఇందులోని మెజారిటీ భాగస్వామైన బెంగళూరు ఆధారిత రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్ మంగళవారం అన్నది. వుయ్‌వర్క్ ఇండియాలో 73 శాతం వాటా ఎంబసీ గ్రూప్‌దే. మిగతా 27 శాతం వాటా వుయ్‌వర్క్ గ్లోబల్ది. వుయ్‌వర్క్ ఇండియాకు హైదరాబాద్‌సహా దేశంలోని ఏడు నగరాల్లో 50 సెంటర్లున్నాయి. ఇక్కడ దాదాపు 90వేల డెస్కులున్నాయి. ఈ క్రమంలోనే వుయ్‌వర్క్ గ్లోబల్‌లో భారతీయ వ్యాపారం.. స్వతంత్రంగా ఉందని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి ఓ ప్రకటనలో తెలిపారు.
అందువల్ల ఈ దివాలా వల్ల వుయ్‌వర్క్ ఇండియాకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. తమ సభ్యులు, భూస్వాములు, భాగస్వాములకు ఎప్పట్లాగే వుయ్‌వర్క్ నుంచి సేవలు అందుతాయని స్పష్టం చేశారు. అంతేగాక వుయ్‌వర్క్ ఇండియా బిజినెస్‌లో మరిన్ని పెట్టుబడులకూ కట్టుబడి ఉన్నామని కరణ్ స్పష్టం చేశారు. 2021 నుంచి వుయ్‌వర్క్ ఇండియా లాభాల్లో ఉన్నట్టు గుర్తుచేశారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కంపెనీ రెవిన్యూ 40 శాతం పెరిగి రూ.400 కోట్లకు చేరిందని చెప్పారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కార్పొరేట్ సంస్థల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించారు. ఇక గత ఆర్థిక సంవత్సరం (2022-23) కంపెనీ టర్నోవర్ రూ.1,400 కోట్లుగా నమోదైంది.
మార్కెట్ విలువ ఆవిరి
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వుయ్‌వర్క్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెద్ద ఎత్తున పడిపోయింది. సంస్థ షేర్ విలువ ఏకంగా 98 శాతం క్షీణించింది. ఒకప్పుడు 47 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ.. ఇప్పుడు 50 మిలియన్ డాలర్లలోపే. సంస్థకు నికర దీర్ఘకాలిక రుణ భారం 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆగస్టులో వుయ్‌వర్క్ ప్రకటించింది. అలాగే 13 బిలియన్ డాలర్లకుపైగా దీర్ఘకాలిక లీజులున్నాయి.