హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్..హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. నగరంలో సంస్థ ఏర్పాటు చేసిన ఐదో సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ 60 దేశాల్లో 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగివున్నదన్నారు.
డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో ప్రపంచస్థాయి సేవలను ఇక్కడి నుంచే అందిస్తున్నాయన్నారు. గ్లోబల్ కంపెనీల అడ్డగా హైదరాబాద్ మారిపోయిందని, ఇప్పటికే పలు సంస్థలు ఇక్కడ తమ రెండో కార్యాలయాన్ని తెరిచాయని చెప్పారు. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 5 వేల మంది కూర్చోవడానికి వీలుంటుందని, తద్వారా అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించడానికి వీలుపడనున్నట్లు హెచ్సీఎల్ టెక్నాలజీ సీఈవో, ఎండీ విజయకుమార్ తెలిపారు.