హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం. అందుకే ఇక్కడ ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. దానికి ఆంధ్రప్రదేశ్‌లోని సీ పోర్ట్‌కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు అభివృద్ధి చేస్తాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బయో సైన్సెస్, బయో టెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్‌ను అభివృద్ధిపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. బయోఏషియా-2025 వార్షిక సదస్సును మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయోఏషియా సదస్సు హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందన్నారు. హెల్త్‌కేర్ రంగంలో ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయోఏషియా సదస్సు నిలుస్తున్నదన్నారు.
ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ మరియు బయో టెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయని, రాబోయే పదేండ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను మా పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామన్న ఆయన.. గత 25 సంవత్సరాలలో హైదరాబాద్.. ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ పవర్ హౌస్‌గా పేరుగాంచిందన్నారు. కాగా, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ స్టేట్ ప్రతినిధులతో హైచ్ఐసీసీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. వారు సానుకూలంగా స్పందించారు.