Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గతవారం ముగింపులో భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు సోమవారం పుంజుకున్నాయి. దేశంలో రాజకీయ పరిస్థితులు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సూచీలు పతనమయ్యాయి. రాజకీయాలకు, స్టాక్ మార్కెట్లకు లింక్ చేయకూడదని కేంద్రమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సూచీలు లాభాల్లో ట్రేడాయి.
స్టాక్స్ కదలికలను తాను ఊహించలేదని.. కానీ, సాధారణంగా కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా మార్కెట్ ర్యాలీని చూస్తుందని.. తాము 400కుపైగా సీట్లను గెలుచుకుంటామన్నారు. మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని.. దాంతో మార్కెట్ పెరుగుతుందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కిత్రం సెషన్తో పోలిస్తే సోమవారం ఉదయం సెన్సెక్స్ 72,476.65 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో ఒక దశలో 71,866.01 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. గరిష్ఠంగా 72,863.56 పాయింట్లకు పెరిగింది.
చివరకు 111.66 పాయింట్లు పెరిగి 72,776.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 48.85 పాయింట్లు పెరిగి.. 22,104.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో సిప్లా, ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడగా.. టాటా మోటార్స్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో ముగిశాయి. సెక్టోరల్ వారీగా నిఫ్టీ ఫార్మా 1.8శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 0.7శాతం, ఐటీ 0.4శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 1.68శాతం పడిపోయింది, పీఎస్యూ బ్యాంక్1.2 శాతం, , ఆయిల్ అండ్ గ్యాస్ 0.8శాతం పతనమయ్యాయి.