Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా ఏడు సెషన్లలో నష్టాలను చవిచూసిన మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడంతో వరుసగా నష్టాలను చవిచూశాయి. బ్లూచిప్ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రాణించడం, ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు సానుకూలంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా లాభాల్లో కొనసాగింది. నిఫ్టీ సైతం దాదాపు 600 పాయింట్ల వరకు చేరింది. చివరలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు స్వల్పంగా తగ్గాయి.
క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 77,548.00 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో ఒకదశలో 77,411.31 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 78,451.65 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 239.38 పాయింట్ల లాభంతో 77,578.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 64.70 పాయింట్ల లాభంతో 23,518.50 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎంఅండ్ఎం, ట్రెంట్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా.. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హిందాల్కో నష్టపోయాయి. సెక్టార్లలో మీడియా, ఆటో, రియల్టీ 1-2.5 శాతం, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ 0.5 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు ఒకశాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి.