ముంబై, జూన్ 14: తీవ్ర ఒడుదొడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడైనా.. ఆఖర్లో మాత్రం లాభాలనే అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 181.87 పాయింట్లు లేదా 0.24 శాతం పెరిగి 77వేలకు సమీపంలో మునుపెన్నడూ లేనివిధంగా 76,992.77 వద్ద ముగిసింది. అయితే ఒకానొక దశలో 77,081.30 స్థాయిని తాకింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 66.70 పాయింట్లు లేదా 0.29 శాతం అందిపుచ్చుకొని క్రితమెన్నడూ లేనట్టుగా 23,465.60 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 23,490.40 స్థాయిదాకా వెళ్లింది. కాగా, ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 299.41 పాయింట్లు, నిఫ్టీ 175.45 పాయింట్లు పుంజుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ తదితర షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ఆల్‌టైమ్ హైని తాకుతూ శుక్రవారం రూ.435 లక్షల కోట్లను సమీపించింది. తొలిసారి రూ.4,34, 88,147.51 కోట్ల వద్ద స్థిరపడింది. గత మూడు రోజుల్లోనే రూ.7.93 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. ఎన్ఎస్ఈలోని మదుపరుల సంపద కూడా రికార్డు స్థాయిల్లోనే కదలాడుతున్నది.
పెన్నా సిమెంట్‌ను కొన్న నేపథ్యంలో అంబుజా సిమెంట్ షేర్ల విలువ బీఎస్ఈలో 1.90 శాతం, ఎన్ఎస్ఈలో 1.36 శాతం చొప్పున పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,115.85 కోట్లు ఎగిసి బీఎస్ఈలో రూ.1,66,741.14 కోట్లకు చేరింది.