ముంబై, ఏప్రిల్ 7 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ప్రారంభంలో నష్టపోయిన సూచీలకు ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. 1,400 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 509.73 పాయింట్లు ఎగబాకి 74,616.58 పాయింట్ల వద్ద నిలిచింది.
మరో సూచీ నిఫ్టీ 155.40 పాయింట్లు అందుకొని 23.123.65 పాయింట్లకు చేరుకున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతు సూచీలు లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టపోయాయి.