Cigarette Prices | న్యూఢిల్లీ, డిసెంబర్ 2: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతోపాటు శీతలపానియాల ధరల మరింత పెరగబోతున్నాయి. జీఎస్టీ పన్నురేటు హేతుబద్దీకరణలో భాగంగా ప్రస్తుతం వీటిపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 35 శాతానికి పెంచాలని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన సోమవారం జీవోఎం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. జీవోఎం నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 21న సమావేశమైన తుది నిర్ణయం తీసుకోనున్నది.
వీటితోపాటు దుస్తులపై పన్నును సవరించింది. రూ.1,500 లోపు రెడీమేడ్ గార్మెంట్లపై 5 శాతం పన్ను విధించనుండగా, అలాగే రూ.1,500 నుంచి రూ.10 వేల లోపు రెడీమేడ్ గార్మెంట్లపై 18 శాతం, రూ.10 వేలకు పైబడి గార్మెంట్లపై 28 శాతం విధించాలని జీవోఎం సూచించింది. కొత్తగా 148 ఉత్పత్తులపై పన్ను విధించాలని జీవోఎం సూచించగా, దీనిపై జీఎస్టీ నిర్ణయం తీసుకోనున్నది.
ప్రస్తుతం జీఎస్టీ పన్నుల్లో నాలుగు స్లాబ్‌లు ఉండగా, కొత్తగా 35 శాతం రేటును కూడా చేర్చాలని జీవోఎం సూచించింది. కొత్త స్లాబ్‌లో పొగాకు, ఇందకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు శీతలపానియాలు చేర్చాలని పేర్కొంది. ప్రస్తుతం 5, 12, 18,28 శాతం రేట్లలో పన్నులు విధిస్తున్నది. లగ్జరీ ఉత్పత్తులైన కార్లు, వాషింగ్ మెషిన్లు, పొగాకు ఉత్పత్తులు 28 శాతం స్లాబ్‌లో ఉన్నాయి.