V Anantha Nageswaran | ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) వీ అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దాంతో నాగేశ్వరన్ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన 2022, జనవరి 28న సీఈఏగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం ఆయన కార్యాలయం బాధ్యత. మాజీ క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీ, జూలియన్ బేర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్, విద్యావేత్త అయిన నాగేశ్వరన్.. కేవీ సుబ్రమణియన్ స్థానంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియామకయ్యారు.
ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాల మధ్య 2024-25 ఆర్థిక సర్వే రాబోయే ఆర్థిక సంవత్సరానికి 6.3-6.8 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన కొద్దివారాల తర్వాత.. నాగేశ్వరన్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం అంచనా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 6.4శాతం వృద్ధి చెందుతుందని అంచనా. నాగేశ్వర్ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైమ్ సభ్యుడిగా పని చేశారు. భారత్, సింగ్‌పూర్‌లో అనేక బిజినెస్ స్కూల్స్ పని చేశారు. నాగేశ్వరన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (MBA) డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆయన ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, క్రియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.