ముంబై, ఆగస్టు 13: ఇక బ్యాంకుల్లో సమర్పించిన చెక్కులు వేగంగా క్లియర్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 4 నుంచి ఓ కొత్త విధానాన్ని పరిచయం చేయనున్నది మరి. దీంతో ప్రస్తుతం రెండు పనిదినాలు పడుతున్న చెక్ క్లియరెన్స్‌ల సమయం.. కొద్ది గంటల్లోకి తగ్గిపోనున్నది. చెక్కులు స్కానై, ఆ తర్వాత బ్యాంకుల్లో జమై, ఆపై పాసైపోనున్నాయి. ఇదంతా కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిపోతుందని ఆర్బీఐ అంటున్నది. ఇప్పుడు బ్యాంక్‌లో క్లియరెన్స్ కోసం చెక్ వేస్తే.. గరిష్ఠంగా మరుసటి రోజుగానీ పని కావట్లేదు. సెలవు దినాలు వస్తే మరింత ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. కానీ త్వరలో బ్యాంక్‌లో చెక్ సమర్పించిన రోజే అది క్లియర్ అవుతుందని ఆర్బీఐ చెప్తున్నది.
ఇప్పుడున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) పనితీరు సుదీర్ఘంగా ఉన్నది. అందుకే సీటీఎస్‌లో కంటిన్యుయస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్ సదుపాయాన్ని ఆర్బీఐ తీసుకొస్తున్నది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌నూ జారీ చేసింది. కస్టమర్లకు దీనిపై అవగాహనను పెంచాలని బ్యాంకర్లకు అందులో సూచించింది. చెక్ క్లియరెన్స్ సామర్థ్యం మెరుగవడానికి, పార్టిసిపెంట్ల సెటిల్మెంట్ రిస్క్ తగ్గడానికి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరగడానికే దీన్ని తెస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది. కాగా, సీటీఎస్‌ను రెండు దశల్లో కంటిన్యుయస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్‌కు మార్చనున్నారు. తొలి దశ అక్టోబర్ 4న అమల్లోకి వస్తుంది. రెండో దశ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమలు కానున్నది.
కొత్త పద్ధతిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే ప్రజెంటేషన్ సెషన్లో చెక్కుల క్లియరెన్స్ పని పూర్తవుతుందని ఆర్బీఐ చెప్తున్నది. ఉదాహరణకు.. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య బ్యాంకులు చెక్కులను స్వీకరిస్తాయి. మధ్యాహ్నం 2 గంటలలోగా కస్టమర్‌కు సదరు బ్యాంక్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే చెక్ క్లియరైనట్టుగానే భావించాలి. వెంటనే సెటిల్మెంట్ కూడా జరిగిపోతుందని ఆర్బీఐ వివరిస్తున్నది. సంబంధిత బ్యాంకుల మధ్య పాజిటివ్, నెగటివ్ కన్ఫర్మేషన్ల ఇన్ఫర్మేషన్ కూడా విడుదలైపోతుంది.