TTD Jobs Scam | టీటీడీలో పర్మినెంట్ ఉద్యోగాలిప్పిస్తామని అమాయకులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది చీట్ చేసిన ఘటన బయట పడింది. ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మరో వ్యక్తి కలిసి 17 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి రూ.1.50 కోట్లు వసూలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడని అనుమానిస్తున్న బాలకృష్ణను విచారించడంతో మున్సిపల్ ఉద్యోగుల బాగోతం బయటపడింది. పిచ్చాటూరు వాసి బాలకృష్ణ.. తిరుపతిలో ఉంటూ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో పరిచయాలతో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, కమిషనర్ కారు డ్రైవర్ హేమంత్‌తో పాటు అతడి బావమరిది శివను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల నుంచి వీరు రూ.1.50 కోట్లు వసూలు చేశారని గుర్తించారు. దీనిపై కేసు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.