Crypto in Budget 2022 | తక్కువ కాలంలో ఎక్కువ లాభాలిచ్చే క్రిప్టో కరెన్సీలపై భారతీయులు మనస్సు పారేసుకున్నారు. వచ్చే పదేండ్లలో భారత్లో క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడుల విలువ 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, క్రిప్టో కరెన్సీలతో దేశ ఆర్థిక సుస్థిరతకు ముప్పని ఆర్బీఐ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దేశంలో వాటి ట్రేడింగ్, లావాదేవీలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వం తన వైఖరిని బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లు.. బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలపై దృష్టిని కేంద్రీకరించారు.
వాస్తవంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే క్రిప్టోల నియంత్రణకు బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. సంప్రదింపుల కోసం కేంద్రం వాయిదా వేసింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలు అంతర్జాతీయంగా జరుగడం కూడా బిల్లు వాయిదా పడడానికి మరో కారణంగా తెలుస్తున్నది. క్రిప్టోల నియంత్రణకు తీసుకునే చర్యల్లో భాగంగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై విధించే పన్నుపై క్లారిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై వచ్చే ఆదాయం మీద పన్ను, టీడీఎస్, టీసీఎస్, క్రిప్టోల క్రయ విక్రయాలు, జీఎస్టీ విధింపు తదితర అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. క్రిప్టో లావాదేవీలపై పన్ను విధించేందుకు నిబంధన తేవాలన్న సూచన కూడా వినిపిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి దేశీయంగా క్రిప్టో కరెన్సీలకు ప్రోత్సాహం లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానమైనవి. వాటి పరిధిలోనే పన్ను విధానం, నియంత్రణ, నిబంధనలు రూపొందించాల్సి ఉంటుందని క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్ వర్గాలు భావిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలను సెబీ పర్యవేక్షణలోకి తేవడంతో చట్టబద్ధమైన ట్రేడింగ్ ఆస్తిగా పరిగణించవచ్చు.