Committee to strengthen SEBI | యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ సంస్థల పతనం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై తలెత్తిన సందేహాలపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ – సెబీ నియంత్రణ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై ఈ కమిటీ పరిశీలించనున్నది. ఈ కమిటీలో ఉండే నిపుణుల పేర్లను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణ శుక్రవారం జరుగనున్నది.
అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సుప్రీంకోర్టు రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌లు పీఎస్ నరసింహా, జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తాజా వివాదం నేపథ్యంలో భవిష్యత్‌లో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో సూచనల రూపంలో తెలియజేయాలని ఇవ్వాలని సెబీని ఆదేశించింది. వచ్చే సోమవారం పూర్తి వివరాలతో హాజరు కావాలని సెబీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఆదేశాలు జారీ చేసింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల భారీ స్థాయిలో ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నారని న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దేశ ప్రతిష్టను హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బ తీస్తున్నదని విశాల్ తివారీ ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మరో పిటిషనర్ ఎంఎల్ శర్మ తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదికపై మీడియా అతిగా స్పందిస్తున్నదని పేర్కొన్నారు. సెబీకి ఆధారాలు సమర్పించడంలో హిండెన్‌బర్గ్ ఫౌండర్ నాథన్ అండర్సన్ విఫలం అయ్యారన్నారు.
హిండెన్‌బర్గ్ ఫౌండర్ నాథన్ అండర్సన్, భారత్‌లోని ఆయన అనుయాయులపైన కేసు దర్యాప్తునకు సెబీని, కేంద్ర హోంశాఖను ఆదేశించాలని ఎంఎల్ శర్మ తన పిటిషన్లో కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ కమిటీని వేయాలని విశాల్ తివారీ కోరారు.