హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వచ్చే రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలు డిమాండ్‌కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం కావాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గు సంస్థల మనుగడకు కొత్త గనులను పెంచుకోవడం అత్యంత అవసరమని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు బొగ్గు అందుబాటులోకి తీసుకురావచ్చని, తద్వారా విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గి ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి కోలిండియా, సింగరేణి ఉన్నతాధికారులు హాజరయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్ బలరాం హైదరాబాద్ సింగరేణిభవన్ నుంచి సమీక్షలో పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కంపెనీ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పలు సూచనలు చేశారు. కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించాలని సూచించారు. ఇందుకోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలని, పని సంస్కృతిని మెరుగుపరచాలని కోరారు.
సింగరేణి సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు లీక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ డైరెక్టర్ (పీపీ అండ్ పర్సనల్) హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఒక సర్క్యూలర్ జారీచేశారు. కంపెనీ రహస్య పత్రాలు తమకు ఇవ్వాల్సిందిగా కొందరు వ్యక్తులు ఉద్యోగులను, అధికారులను బెదిరిస్తున్నట్టు, ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలుస్తున్నదని, అలాంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా లెక చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.