న్యూఢిల్లీ, జూన్ 20: సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ద్రవ్యలోటును అదుపుచేయడం, ఆర్థికాభివృద్ధిని కొనసాగించడం, ద్రవ్యోల్బణానికి కళ్లెంవేయడం, కరెంటు ఖాతా లోటును నిర్వహించడంలో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన మంథ్లీ ఎకనామిక్ రిపోర్ట్‌లో పేర్కొంది. కష్టపడి సాధించుకున్న ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ఈ సవాళ్లను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉందన్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, ముఖ్యంగా అభివృద్ధిచెందిన దేశాలు ఇదేతరహా సవాళ్లను చూస్తున్నాయని, వీటిని ఎదుర్కొనే విషయంలో భారత్ స్థితి ఇతర దేశాలకంటే మెరుగ్గా ఉన్నదని, ఆర్థిక స్థిరత్వం, వ్యాక్సినేషన్ విజయవంతంకావడం ఇందుకు కారణమని ఆర్థిక శాఖ వివరించింది. భారత్ మధ్యకాలిక వృద్ధి అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయని, ప్రైవేట్ రంగం చేపడుతున్న సామర్థ్య విస్తరణ ఫలితంగా ఈ మిగిలిన దశాబ్దంలో మూలధన కల్పన, ఉపాధి కల్పన జరుగుతుందన్న ఆశాభావాన్ని రిపోర్ట్ వ్యక్తం చేసింది.
రూపాయికి రిస్క్
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజు సుంకాల తగ్గింపుతో 2022-23 బడ్జెట్లో నిర్దేశించుకున్న స్థూల ద్రవ్యలోటు లక్ష్యానికి రిస్క్ ఉన్నదని, దీంతో కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందని, దిగుమతులు ఖరీదై, రూపాయి విలువ బలహీనపడుతుందని, విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతింటుందని ఆర్థిక శాఖ హెచ్చరించింది. రూపాయి తరుగుదల రిస్క్‌ను, ద్రవ్య, కరెంట్ ఖాతా లోట్లను అధిగమించడానికి, వృద్ధికి దోహదపడే మూలధన వ్యయానికి మద్దతుగా మూలధనేతర వ్యయాన్ని హేతుబద్దీకరించడం కీలకమని తెలిపింది. కేంద్ర బ్యాంక్‌ల పాలసీ రేట్ల పెరుగుదల, ధనిక దేశాల్లో కఠిన ద్రవ్య విధానం కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిధులు దేశం నుంచి తరలివెళుతున్నంతకాలం రిస్క్ ఉంటుందన్నది. అంతర్జాతీయంగా ముడి చమురు, వంటనూనెల ధరలు పెరగడం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అధికస్థాయిలో ఉన్నదని, వేసవి వేడిమి కూడా దేశీయంగా ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలకు దారితీసిందని ఆర్థిక శాఖ వివరించింది.
అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగిస్తున్నందున, ఒపెక్ దేశాలు సరఫరాలు పెంచినందున, రానున్న నెలల్లో చమురు ధరలు దిగివస్తాయని అంచనా వేసింది. రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య విధానాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఒత్తిడులను తగ్గించడంపైనే ఆర్బీఐ పూర్తిగా దృష్టి నిలిపిందన్నది. అలాగే సుంకాల తగ్గింపు, అవసరార్ధులకే సబ్సిడీలను అందించడం తదితర చర్యల ద్వారా ద్రవ్యల్బణం కట్టడికి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నదని రిపోర్ట్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నాయని, ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2022-23లో వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. స్టాగ్ఫ్లేషన్ భయాలు ప్రపంచంలో ఉన్నప్పటికీ, ఇండియాకు ఆ రిస్క్ తక్కువని తెలిపింది.