న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సహారా గ్రూప్ సంస్థలపై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో)సహా కంపెనీల చట్టం కింద చేస్తున్న మరే ఇతర విచారణలైనాసరే ఎవరో ఒకరు చనిపోయారని ఆగబోవు అంటూ సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత నెల 14న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మరణించిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.
2018 అక్టోబర్ 31న సహారా గ్రూప్‌నకు చెందిన సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా క్యూ షాప్ యూనిక్ ప్రోడక్ట్స్ రేంజ్ లిమిటెడ్, సహారా క్యూ గోల్డ్ మార్ట్ లిమిటెడ్ సంస్థలపై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 7న సహారా గ్రూప్‌నకే చెందిన మరో ఆరు సంస్థలపైనా దర్యాప్తులకు ఆదేశించినట్టు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కేసులో సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లనుద్దేశించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అనుసరిస్తున్నదని, అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకే బాధితులకు రిఫండ్ జరుగుతుందని తెలియజేశారు.
దేశంలో 53 చైనా సంస్థలున్నాయని లోక్‌సభకు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. అయితే ఈ సంస్థలు యాప్‌ల ద్వారా రుణాలను ఇస్తూ వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయా? అన్నదాని గురించి మాత్రం సమాచారం లేదని చెప్పారు. ఇక ఈ ఏడాది మే నెలలో సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీ-పేస్)ను ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి దేశంలో 7,700లకుపైగా కంపెనీలు స్వచ్చంధంగా తమ వ్యాపారాలను మూసేసుకున్నాయన్నారు. 2013 కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 (2) కింద వాలంటరీ ఎగ్జిట్‌ను కోరుకునే సంస్థల కోసం సీ-పేస్‌ను తెచ్చారు.
ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈ ఆర్థిక సంవత్సరం (2023 -24) ఏప్రిల్-అక్టోబర్ మధ్య రూ. 27,105 కోట్ల పెట్టుబడులను పెట్టిందని లోక్‌సభకు కార్మిక, ఉపాధి శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ తేలి వెల్లడించారు. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.53, 081 కోట్లు, 2021-22లో రూ.43,568 కోట్ల పెట్టుబడుల్ని ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్‌వో పెట్టిందని తెలియజేశారు.