హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క పైసా ఇవ్వలేదు. గ్రీన్‌ఫీల్డ్ పార్కుకు బదులు బ్రౌన్‌ఫీల్డ్ పార్కును మంజూరు చేసిన మోదీ సర్కారు.. దానికి కూడా నిధులు మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నది. తెలంగాణ మినహా 6 రాష్ర్టాలకు ఇప్పటికే మొదటి విడుత నిధులు విడుదలైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పత్తి దిగుబడి గణనీయంగా పెరగడంతో వరంగల్ కేంద్రంగా వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,190 ఎకరాల్లో కేఎంటీపీని ఏర్పాటు చేసింది. పత్తి స్పిన్నింగ్ దగ్గర్నుంచి రెడీమేడ్ దుస్తుల తయారీదాకా అన్నీ ఇక్కడే జరిగేలా, తద్వారా ప్రత్యక్షంగా 75వేల మందికి, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించేలా దీన్ని అభివృద్ధి చేసింది.
అయితే దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కుల్లో ఒకటైన కేఎంటీపీకి ఆర్థిక సాయం అందించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేకమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా నిధులు మంజూరు చేయలేదు. అనంతరం కేంద్రం టెక్స్టైల్ రంగంలో ‘5ఎఫ్’ (ఫామ్ టూ ఫైబర్ టూ ఫ్యాక్టరీ టూ ఫ్యాషన్ టూ ఫారెన్) విజన్‌తో ప్రవేశపెట్టిన పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పథకంలో కేఎంటీపీకి చోటు కల్పించింది. రూ.4,445 కోట్లతో 2021-28 మధ్య 7 టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పథకాన్ని తెచ్చింది. తెలంగాణకు టెక్స్టైల్ పార్కును మంజూరు చేసినట్టు స్వయంగా ప్రధాన మంత్రే పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ ఐదేండ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
పీఎం మిత్ర పథకం కింద తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు కేంద్రం టెక్స్టైల్ పార్కులు మంజూరు చేసింది. వీటిలో తెలంగాణలోని వరంగల్, మహారాష్ట్రలోని అమరావతిలో మినహా మిగిలిన 5 రాష్ర్టాలకు గ్రీన్‌ఫీల్డ్ టెక్స్టైల్ పార్కులు మంజూరయ్యాయి. గ్రీన్‌ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు అంటే కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసే పార్కు. ఇప్పటికే ఏర్పాటైన పార్కులో రీ-డెవలప్మెంట్ కింద మౌలిక సదుపాయాలు కల్పించేదాన్ని బ్రౌన్‌ఫీల్డ్ పార్కు అంటారు. పెట్టుబడి సాయం కింద కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు, బ్రౌన్‌ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్ల చొప్పున అందిస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకానికి అంకురార్పణ చేయకముందే వస్త్ర పరిశ్రమకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్ర నిధులతో కేఎంటీపీని అభివృద్ధి చేశారు. కానీ, బ్రౌన్‌ఫీల్డ్ పార్కుతో కేంద్రం దెబ్బతీసింది.
కేఎంటీపీలో పరిశ్రమల ఏర్పాటుకు కిటెక్స్, ఎంగ్‌వన్, గణేషా, తిరువూరు ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ తదితర అంతర్జాతీయ కంపెనీలు సహా మొత్తం 20 సంస్థలు బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. వాటిలో ఎంగ్‌వన్, కిటెక్స్, గణేషా తదితర కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. సుమారు రూ.9 వేల కోట్ల అంచనాతో దశలవారీగా అభివృద్ధి చేయాల్సిన కేఎంటీపీలో రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాల కల్పన బీఆర్ఎస్ హయాంలోనే చాలావరకు పూర్తయింది. అయితే వృథా నీటి డిస్పోజల్ వ్యవస్థ, కామన్ ఫెసిలిటీస్, ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్యాక్టరీ బిల్డింగ్స్ నిర్మాణం తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నది.