ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి మరోమారు సిద్ధమవుతున్నది మోదీ సర్కారు. ఇప్పటికే డజనుకుపైగా పీఎస్‌బీలను ఇతర సర్కారీ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కలిపేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12కు పడిపోయింది. ఈ క్రమంలో మరిన్ని బ్యాంకులను కనుమరుగు చేసేందుకు గట్టిగానే బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 12 : ప్రభుత్వ రంగ బ్యాంకు (PSB)ల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు భేటీ అయ్యాయి. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బుధవారం పీఎస్బీ చీఫ్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) సహా దేశంలోని మొత్తం 12 పీఎస్‌బీల సారథులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్), అర్ధ వార్షికం (ఏప్రిల్-సెప్టెంబర్)లో బ్యాంకుల పనితీరుపై ఈ సందర్భంగా నాగరాజు ఆరా తీశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే దేశంలో పెద్ద, ప్రపంచ శ్రేణి బ్యాంకుల అవసరం ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రభుత్వ బ్యాంకులతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని చెప్పిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో తాజా సమావేశం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. తొలుత స్థూల నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్పీఏలు), నష్టాలు ఎక్కువగా ఉన్న బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో కలిపేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయా బ్యాంకుల ఆర్థిక తీరుతెన్నులను అత్యున్నత స్థాయి వర్గాల నుంచే క్షుణ్ణంగా తెలుసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే పీఎస్‌బీల చైర్మన్లు, సీఈవోలు, ఎండీలతో ఈ మీటింగ్ జరిపారని తెలుస్తున్నది. ఆర్థిక సేవల శాఖ సీనియర్ అధికారులు, భారతీయ బ్యాంకుల సంఘం చైర్మన్ సహా ఉన్నతాధికారులు, పీఎస్బీ అనుబంధ సంస్థలు ఎండీ, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పీఎస్‌బీల విలీనాన్ని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నిర్మలా సీతారామన్ తీరును యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) విమర్శించింది. ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేయాల్సిన పాలకులే.. నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలు అందాలంటే పీఎస్‌బీల వల్లే సాధ్యమని, అయినప్పటికీ విలీనాలు-ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టింది. వివిధ పౌర సంఘాలూ ప్రభుత్వ పోకడను ఎండగట్టాయి. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరిన తర్వాత 27గా ఉన్న పీఎస్‌బీలు 12కు పరిమితమయ్యాయి. ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) సహా మరో 4 అనుబంధ బ్యాంకులు విలీనమైపోయాయి. అలాగే బీవోబీలో దేనా, విజయా బ్యాంక్‌లు, కెనరాలో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేషన్, ఆంధ్రా బ్యాంక్‌లు కలిసిపోయాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి 2020 ఏప్రిల్ 1 వరకు ఈ విలీనాలు జరుగుతూపోయాయి.
ఈ జూలై-సెప్టెంబర్‌లో పీఎస్బీలన్నీ కలిసి రూ.49,456 కోట్ల లాభాన్ని అందుకున్నాయి. రెండు మినహా మిగతా బ్యాంకులన్నీ నిరుడు జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే వృద్ధినే కనబర్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికంలో ఈ బ్యాంకులన్నింటి లాభాలు కలిసి రూ.45,547 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఈసారి రూ.3,909 కోట్లు పెరుగుదల కనిపించింది. ఇది 9 శాతం వృద్ధికి సమానం. ఈసారి పీఎస్‌బీల లాభాల్లో ఒక్క ఎస్బీఐ వాటానే 40 శాతంగా ఉండటం గమనార్హం. ఈ జూలై-సెప్టెంబర్‌లో ఎస్బీఐ నికర లాభం రూ.20,160 కోట్లుగా ఉన్నది. క్రిందటి ఏడాదితో పోల్చితే 10 శాతం పుంజుకున్నది. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) లాభాల్లో అత్యధికంగా 58 శాతం వృద్ధి కనిపించింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 33 శాతంతో ఉన్నది. కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే 8 శాతం, 10 శాతం చొప్పున లాభాలను తగ్గించుకున్నాయి.
అన్ని ప్రభుత్వ బ్యాంకుల నుంచి స్టార్టప్‌లు రుణ సౌలభ్యం అందుకొనేలా ఓ సింగిల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తూ జన్‌సమర్థ్ పోర్టల్‌పై సరికొత్త ఫీచర్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రారంభించింది. 14 క్రెడిట్-లింక్డ్ ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ జన్‌సమర్థ్ పనిచేస్తుంది. ఈ క్రమంలోనే స్టార్టప్ కామన్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ పేరిట ఓ నయా ఫీచర్‌ను పీఎస్‌బీల రివ్యూ మీటింగ్‌లోనే ఆవిష్కరించారు. పీఎస్‌బీల సహకారంతో దీన్ని ఐబీఏ అభివృద్ధిపర్చింది. రుణాల కోసం స్టార్టప్‌లు దీనిద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రగతిపైనా ఈ సందర్భంగా చర్చించారు. ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాలకు రుణ లభ్యతను పెంచాలని ఆర్థిక శాఖ బ్యాంకర్లకు సూచించింది.