న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశీయ బీమా రంగం.. పరదేశీ సంస్థల గుప్పిట్లోకి వెళ్తోంది. అవును.. విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కారు తలుపులు బార్లా తెరిచింది. భారత్‌లో ఆయా దేశాల కంపెనీలు స్వేచ్ఛగా బీమా వ్యాపారం చేసుకోవడానికి శుక్రవారం కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతించాలని నిర్ణయించింది.
ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తున్నది. అయితే ఈ నెల 19తో ఈ సెషన్ ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే వారం సభకు బిల్లు పరిచయం కానుందని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే సోమవారమే తేవచ్చని తెలుస్తున్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశీయ బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించే ప్రతిపాదనను పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో నిర్ణయం వెలువడింది.
ఇప్పుడు భారతీయ బీమా రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉన్నది. అంటే.. దేశంలో ఓ విదేశీ కంపెనీ బీమా వ్యాపారం చేయాలంటే 26 శాతం స్వదేశీ సంస్థ వాటాతోనే సాధ్యం. కానీ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం.. పరదేశీ సంస్థలకు భారతీయ కంపెనీలతో జట్టు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తున్నది. ఆసక్తిగల విదేశీ కంపెనీలు భారతీయ బీమా రంగంలోకి యథేచ్ఛగా వచ్చి పూర్తి స్వయం ప్రతిపత్తితో బిజినెస్ చేసుకోవచ్చన్నమాట. ఫలితంగా భారత్‌కు చెందిన కంపెనీలకు ఇక తీవ్ర పోటీనే ఉంటుందన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
అయినప్పటికీ లోక్‌సభ వివరాల ప్రకారం బీమా చట్టాల (సవరణ) బిల్లు 2025తో దేశ ప్రజలకు బీమా సదుపాయం మరింత చేరువ అవుతుందని, 2047కల్లా అందరికీ బీమా భరోసా లభిస్తుందని, భారీ పెట్టుబడులతో బీమా రంగం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని, సులభతర వ్యాపార నిర్వహణకు వీలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. పాలసీదారుల ప్రయోజనాల రక్షణకు, వారి ఆర్థిక భద్రతకు, భారతీయ బీమా మార్కెట్లో ప్రగతి-మెరుగైన ఉద్యోగావకాశాలకే ఈ చట్టాల సవరణలు, విదేశీ సంస్థలకు అనుమతినిస్తున్నామని చెప్తున్నది.
పేద, ధనిక అనే తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ బీమా భరోసాను కోరుకుంటారు. బీమాతో వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి మరి. అందుకే భారతీయ మార్కెట్లో జీవిత, ఆరోగ్య, ఇతర బీమాలకు ఎప్పుడూ గిరాకీ ఉండనే ఉంటుంది. అయితే ఇప్పుడు స్వదేశీ సంస్థలు లేదా స్వదేశీ/విదేశీ కలయికలో ఏర్పడ్డ జాయింట్ వెంచర్లు బీమా సేవలను దేశ ప్రజలకు అందిస్తున్నాయి. కానీ కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం నేపథ్యంలో కేవలం విదేశీ సంస్థలే ఇన్సూరెన్స్ సర్వీసును అందించనున్నాయి. ఇక్కడే భద్రతాపరమైన అనుమానాలు తలెత్తుతున్నాయి. విదేశీ కంపెనీలు వ్యాపార కోణంలోనే బీమాను చూస్తాయి. దాంతో పాలసీదారులకు ఆశించిన భద్రత ఉంటుందా? అన్న సందేహాలున్నాయి.
కంపెనీలు మూతబడితే బీమా భరోసా మాటేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే పాలసీదారుల ప్రయోజనాలను కాపాడేలా విదేశీ సంస్థలకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉందని పలువురు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కాగా, ఇప్పుడున్న బీమా చట్టం 1938 ప్రకారమే దేశంలో బీమా విధివిధానాలు రూపొందుతున్నాయి. బీమా కంపెనీలు-పాలసీదారుల మధ్య సంబంధాల నియంత్రణ, బీమా వ్యాపార కార్యకలాపాలు, వాటాదారులు, ఐఆర్డీఏఐ అన్నీ దీని పరిధిలోకే వస్తున్నాయి. అయితే దాదాపు 9 దశాబ్దాల ఈ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవడానికి ఇప్పుడు మోదీ సర్కారు సిద్ధమైంది.