NSE Scam | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఎండీ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్ర రామకృష్ణకు ఎదురు దెబ్బ తగిలింది. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం నిరాకరించింది. ఈ కేసు పూర్వాపరాలపై ఇరువైపులా వాదనలు విన్న స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి సంజీవ్ అగర్వాల్.. ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
ఇంతకుముందు దీనిపై కోర్టు తీర్పు రిజర్వు చేసింది. ప్రస్తుత కేసు విచారణ దశలో ప్రస్తుతం విచారణ దశలో ఉన్న ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించలేమని తేల్చేసింది.
ఈ కేసులో నిందితులు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, విచారణ కూడా చాలా శైశవదశలోనే ఉన్నదని న్యాయస్థానం అభిప్రాయ పడింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తీరుపైనా జడ్జి మండిపడ్డారు. నిందితుల పట్ల సెబీ దయతో, సున్నితంగా వ్యవహరించిందన్నారు. ప్రధాన నిందితులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు.
చిత్ర రామకృష్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే స్థాయిలో లోతైన కుట్రతో ఆర్థిక నేరాలు జరుగుతాయని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నది.
ఇటీవలే చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. ముంబై, చెన్నైల్లోని చిత్ర రామకృష్ణ నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) తనిఖీలు చేసింది. ఆమెపై సెబీ కూడా దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్- ఎండీ సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యన్ ప్రస్తుతం సీబీఐ రిమాండ్లో ఉన్నాడు.