భాదోహి(యూపీ), ఆగస్టు 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో పడనున్న భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించాలని కార్పెట్ ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అమెరికాకు ఎగుమతయ్యే వాటిలో అత్యధికంగా కార్పెట్లు ఉండటంతో వీటి మీద ఆధారపడుతున్న వారిపై జీవితాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు.
వీరిలో ఆల్ ఇండియా కార్పెట్ తయారీదారుల సంఘం(ఏఐసీఎంఏ), కార్పెట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(సీఈపీసీ) సభ్యులు కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్ను కలుసుకొని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి రూ.16,800 కోట్ల విలువైన కార్పెట్లు ఎగుమతి కాగా, వీటిలో 60 శాతం అమెరికాకు ఎగుమతి కావడం విశేషం. మిగతా 40 శాతం యూరోపియన్ దేశాలకు అయ్యాయి. టంప్ తీసుకున్న నిర్ణయంతో ఈ రంగంపై ఆధారపడుతున్నవారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని అక్కడి ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతున్నారు.