న్యూఢిల్లీ, జూలై 7: స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా షేర్ బైబ్యాక్‌లను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మళ్లీ పరిచయం చేసింది. ఆగస్టు 1 నుంచి ఓపెన్ మార్కెట్లో కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే బైబ్యాక్ ఆఫర్ మొదలైన తేదీ నుంచి 66 పని దినాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగలదని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు రూపొందించిన విధివిధానాలను ప్రకటించింది. దీంతో బైబ్యాక్‌ల కోసమే ఉద్దేశించిన విండోల ప్రమేయం లేకుండానే రెగ్యులర్ ట్రేడింగ్ వేదికల ద్వారా షేర్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం కంపెనీలకు లభించినైట్టెంది.
గత ఏడాది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లను సెబీ ఆపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ కొంతమంది మదుపర్లకే లాభించేలా ఉందని, వాటాదారులందరికీ సమాన ప్రయోజనాలు అందట్లేదని, పైగా పన్ను సంబంధిత ఇబ్బందులూ ఎదురవుతున్నాయనే సెబీ గుడ్‌బై చెప్పింది. అయితే ఈసారి పారదర్శకతతో కూడిన నిబంధనల్ని తెచ్చామని సెబీ చెప్తున్నది. ఈ క్రమంలోనే కార్పొరేట్లు తమ కంపెనీల్లోని వాటాదారులకు మిగులు నిధులను పంచడానికి ఈ షేర్ బైబ్యాక్ ఉపయోగపడుతుందని, ముఖ్యంగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు స్టాక్ ధరలకూ మద్దతు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా సెబీ వ్యక్తం చేసింది.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. వరుసగా 4 రోజులపాటు లాభాల్లో కదలాడిన సూచీలు.. మదుపర్లు ఆ లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడంతో పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 104.35 పాయింట్లు లేదా 0.13 శాతం కోల్పోయి 78,180.72 వద్ద ముగిసింది. నిజానికి ఒకానొక దశలో 379.85 పాయింట్లు పుంజుకున్నది. కానీ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో నష్టాలు తప్పలేదు.
ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 31.65 పాయింట్లు లేదా 0.13 శాతం దిగజారి 24,398.70 వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో ట్రెంట్ అత్యధికంగా 12.42 శాతం క్షీణించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ మార్కెట్ అంచనాలను అందుకోకపోవడమే కారణం. అలాగే అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ నిరాశపర్చాయి.