Canara Bank | ముంబై, మే 8 : ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,070 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,951 కోట్ల నికర లాభంతో పోలిస్తే 28 శాతం వృద్ధిని కనబరిచింది. మొండి బకాయిల కోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, ఇతర ఆదాయం భారీగా పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు తెలిపారు.
వడ్డీయేతర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 21.74 శాతం ఎగబాకి రూ.6,351 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో కొత్తగా రూ.2,655 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయని, అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.34 శాతం నుంచి 2.94 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు రూ.2,483 కోట్ల నుంచి రూ.1,831 కోట్లకు తగ్గాయని ఆయన చెప్పారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.4 లేదా 200 శాతం డివిడెండ్‌ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది.