న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,105 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,606 కోట్ల లాభం కంటే 11 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.31,472 కోట్ల నుంచి రూ.34,721 కోట్లు గడించింది. ఈ విషయాన్ని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల రూపంలో రూ.29,740 కోట్లు లభించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.76 శాతం నుంచి 3.73 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.41 శాతం నుంచి 0.99 శాతానికి దిగొచ్చింది. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 90.89 శాతంగా ఉన్నది.