న్యూఢిల్లీ, జూలై 24 : ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,752 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 3,905 కోట్ల లాభంతో పోలిస్తే 22 శాతం వృద్ధిని కనబరిచినట్టు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో బ్యాంక్ రూ.38,063 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.28,701 కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ ఏడాది ప్రాతిపదికన 4.14 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 1.24 శాతం నుంచి 0.63 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,845 కోట్ల స్థాయిలో నిధులను వెచ్చించింది.