ChatGPT-Delhi High Court | టెక్నాలజీ సంస్థలు మొదలు కార్పొరేట్ కంపెనీల వరకూ ప్రతి రంగంలోనూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్జీపీటీపైనే ఆధార పడుతున్నారు. కానీ చాట్‌జీపీటీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మానవ మేధస్సును చాట్‌జీపీటీ ప్రభావితం చేయలేదని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ ఇచ్చిన డేటా ఆధారంగా ఏ కేసులోనూ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేవని పేర్కొన్నారు. ఇప్పటికీ చాట్‌జీపీటీ ఇచ్చే డేటాకు ఖచ్చితత్వం లేదంటూనే.. ఆ సమాచారాన్ని ప్రాథమిక దర్యాప్తు లేదా ప్రాథమిక అవగాహనకు ఉపయోగించుకోవచ్చునని వెల్లడించారు.
దేశంలోనే పేరొందిన ఫుట్‌వేర్ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. తన భాగస్వామ్య సంస్థ తమ ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించి బూట్లు తయారు చేసి విక్రయిస్తున్నదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భారత్‌లో ‘రెడ్ సోల్ షూ’పై తమకు గల ట్రేడ్ మార్క్‌ను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని.. ఈ సంగతి చాట్‌జీపీటీ ఇచ్చిన డేటా వల్లే తెలిసిందని పేర్కొంది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఏఐ ఆధారిత చాట్ బోట్స్ రూపొందించిన డేటా ఊహాజనితం, ఖచ్చితత్వం లేదని, దాని ఆధారంగా తీర్పు చెప్పలేమని స్పష్టం చేసింది.
ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. భాగస్వామ్య వ్యాపార ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతివాది అలా బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని ప్రతివాదిని ఆదేశించింది. ఈ విషయమై వాదితో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.