హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదని, వేగంగా అనుమతులిచ్చి కార్యకలాపాలు ప్రారంభించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాయదుర్గంలోని గెలాక్సీ టవర్స్‌లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ ఏర్పాటుచేసిన డిజిటల్ టెక్నాలజీ సెంటర్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘అమెరికాలోని శాండియాగోలో కాల్‌అవే కార్యాలయం క్వాల్కామ్ కేంద్ర కార్యాలయం పక్కనే ఉన్నది. దాని రెండో కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఏర్పాటైంది. ఇక్కడ కూడా అదే కంపెనీ సమీపంలోనే కొత్త కార్యాలయాన్ని కాల్‌అవే తెచ్చింది’ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన యాపిల్, గూగుల్, ఊబర్, నోవార్టీస్, సేల్స్‌ఫోర్స్, మైక్రాన్ వంటి సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడే నెలకొల్పాయని గుర్తుచేశారు. కాల్‌అవే భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. గోల్ఫ్‌తోపాటు పార్టీలకు వేదికలు, స్పోర్ట్స్ బార్లు, రెస్టారెంట్లు నిర్వహించే టాప్ గోల్ఫ్‌కు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమన్నారు.
మౌలిక వసతులు కల్పిస్తాం
పెట్టుబడులు పెడతామంటే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ ఏర్పాటుతో ఒక కొత్త రంగం నగరానికి వచ్చినైట్టెందని, దీని ద్వారా క్రీడలు, ఇతర అనుబంధ రంగాలకు సరికొత్త సాంకేతిక సేవలను అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఇలాంటి కంపెనీల ప్రారంభం హైదరాబాద్‌కు మరింత ప్రతిష్ఠను తీసుకువస్తాయన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. నగరంలో మెరుగైన మౌలిక వసతులేగాక, నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి కూరపాటి, ఐటీ శాఖ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు.
అమెరికా పర్యటనలో హామీ
పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఓ రాష్ట్ర బృందం అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కాల్‌అవే సంస్థ ప్రతినిధులతో సమావేశమై, హైదరాబాద్‌లో తమ సేవలను ప్రారంభించాలని కోరారు. ఇది జరిగి నెలన్నర రోజులే అవుతుండగా, ఈలోపే ఇక్కడ సదరు కంపెనీ తమ డిజీటెక్ సెంటర్‌ను 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కాల్‌అవే టెక్నాలజీ కార్యకలాపాలకు ఈ డిజీటెక్ ఫెసిలిటీ దన్నుగా నిలవనున్నది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. గోల్ఫ్ ఉత్పత్తులు, దుస్తులు, వినోద రంగాల్లో ఈ సంస్థ ఎంతో పేరుగాంచిన సంగతి విదితమే.