UDAN | సామాన్యుడికి విమాన సర్వీసులు అందుబాటులోకి తేవడానికి కేంద్రం అమలు చేస్తున్న ‘ఉడాన్’ పథకం సత్ఫలితాలివ్వలేదని కాగ్ తేల్చి చెప్పింది. ఈ పథకం ప్రారంభించాక విమాన ప్రయాణికులు పదింతలు పెరిగినా సర్వీసులు అదే స్థాయిలో పెరుగలేదని స్పష్టం చేసింది. కాగ్ నివేదికను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు సమర్పించింది.
మూడు దశల్లో 774 మార్గాల్లో ఉడాన్ స్కీమ్ అమలు చేస్తే కేవలం 371 రూట్లలోనే విమాన సర్వీసులు నడిచాయని కాగ్ పేర్కొంది. అందులోనూ 112 రూట్లలోనే మూడేండ్లపాటు రాయితీ పీరియడ్ అమల్లో ఉన్నా.. 54 మార్గాల్లోనే కన్సెషన్ పీరియడ్ మించి విమాన సర్వీసులు నడిచాయని తెలిపింది.
విమానయాన సంస్థలకు ఉడాన్ స్కీమ్ కింద కేటాయించిన 403 రూట్లలో అసలు సర్వీసులే నిర్వహించలేదని కాగ్ తేల్చి చెప్పింది. ప్రారంభంలో కేవలం 46.90 శాతం రూట్లలో సేవలందించిన ఎయిర్ లైన్స్.. మూడేండ్ల తర్వాత ఏడు శాతం రూట్లలోనే ఉడాన్’ విమాన సర్వీసులు నడిచాయని వివరించింది. సామాన్యులకు తక్కువ చార్జీకే సురక్షిత, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ స్కీం మంచిదే అయినా.. దీని అమలు తీరును మెరుగు పర్చాలని కేంద్రానికి కాగ్ హితవు తెలిపింది.