BYD Atto 3 Car | చైనీస్ ఆటో కంపెనీ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) భారతదేశంలోకి అడుగిడింది. తన ఎలక్ట్రిక్ వాహనం ఆట్టో 3 ను ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ప్యాసింజర్ వెహికల్ ఎస్యూవీ బుకింగ్ చేసుకునేందుకు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కారు ధరను నవంబర్‌లో విడుదల చేయనున్నారు. కాగా, కారు డెలివరీలను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నారు.
చైనా కంపెనీ అయినప్పటికీ కారు మాత్రం చెన్నైలో అసెంబుల్ అవుతుంది. ప్రమోషనల్ ప్యాకేజీగా కారుతో 3 సంవత్సరాల 4జీ డాటా సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే 6 ఉచిత మెయింటేనన్స్ సర్వీసులతోపాటు ఆరేండ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ కూడా ఇస్తున్నారు. ఈ-6 ఎంపీవీ తర్వాత భారతదేశం మార్కెట్లోకి వచ్చిన రెండో కారు బీవైడీ ఆట్టో 3.
ఈ కారు బ్యాటరీ కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొన్నది. కేవలం 7.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుండటం దీని ప్రత్యేకత. 6 విధాలుగా సర్దుబాటు చేసుకునే వీలున్న సీట్లు ఉన్నాయి. అదిరిపోయే 8 స్పీకర్ల ఆడియో సిస్టం ఎంతగానో ఆకట్టుకుంటున్నది. 200హెచ్‌పీ గరిష్ట శక్తిని, 310 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ వాహనంలో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 డ్రైవింగ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి.