Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ ఫ్లాట్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలో విక్రయాలు స్టాక్ మార్కెట్ సూచీలపై ఒత్తిడి తెచ్చాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం 81,568 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత స్వల్ప నష్టాల్లోకి జారుకుని, అనంతరం లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 81,742 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.84 గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా షేర్స్ నష్టాలు మూటగట్టుకున్నాయి.