Patrick Doyle @ Burger King | బర్గర్ కింగ్ మాతృసంస్థ రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటీవ్ చైర్మన్‌గా ప్యాట్రిక్ డోయల్ నియమితులయ్యారు. ఈయన గతంలో డోమినోస్ పిజ్జా సీఈఓగా పనిచేశారు. ఈ మేరకు రెస్టారెంట్స్ బ్రాండ్స్ సంస్థ బుధవారం ప్రకటన విడుదల చేసింది. డోమినోస్ పిజ్జా సంస్థలో సీఈఓగా పనిచేసిన ప్యాట్రిక్ డోయల్.. అక్కడ డిజిటల్ సేల్స్‌ను విస్తరించడంలో విశేషంగా కృషిచేశారు.
డోమినోస్ అమ్మకాల్లో 29 వరుస త్రైమాసికాల్లో లాభాలు తీసుకురాగలిగిన డోయల్.. ఆర్బీఐలో చేరడంతో బర్గర్ కింగ్ తిరిగి పుంజుకోగలదన్న ఆశాభావాన్ని మార్గెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2010 లో డోమినోస్ పిజ్జా సీఈఓగా చేరిన సమయంలో దాని షేరు ధర 12 డాలర్ల నుంచి రిజైన్ చేసే సమయానికి 271 డాలర్లకు చేరుకునేలా చేశారు. ఆర్బీఐ షేరు ధర మంగళవారం నాడు 59.74 డాలర్ల వద్ద ముగిసింది. ఇది గత ఐదేండ్లుగా ఇలాగే కొనసాగుతున్నది. ఫ్రాంచైజీలు లాభాలు గడించడంపై పూర్తి దృష్టి సారిస్తానని డోయల్ చెప్పారు. అలాగే, డిజిటల్ ఆర్డర్ల విధానాన్ని సరళీకరణ చేసి ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కంపెనీని ఆర్థిక మాంధ్యం నుంచి బయటపడేయడానికి సంస్థ బ్రాండ్లను వాడుకుంటానన్నారు.