న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. కొత్త ఐటీ విధానంలో ప్రస్తుతం ఇది 75,000గా ఉన్నది. ఈ క్రమంలో మరింతగా పెంచి వేతన జీవులు, పెన్షనర్లకు ఊరటనివ్వాలని అంతా కోరుతున్నారు.
పాత ఐటీ విధానానికి స్వస్తి పలుకాలని చూస్తున్న మోదీ సర్కార్.. గత కొన్నేండ్ల నుంచి కేవలం కొత్త విధానంలోనే మార్పులు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే స్టాండర్డ్ డిడక్షన్‌ను 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జూలైలో ప్రకటించిన బడ్జెట్లో రూ.75,000కు పెంచింది. కానీ పాత ఐటీ విధానంలో యథాతథంగా రూ.50,000గానే ఉంచింది. ఇక గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్లో ఐటీ స్లాబులను సవరించి ఆదాయ పన్ను గరిష్ఠ మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు తీసుకెళ్లింది. ఫలితంగా ఈసారి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలన్న డిమాండ్లు ట్యాక్స్‌పేయర్స్ నుంచి పెద్ద ఎత్తునే వస్తున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు.. మరింతమంది పన్ను చెల్లింపుదారులను పాత ఐటీ విధానం నుంచి కొత్త ఐటీ విధానంలోకి మారేలా చేయగలదనీ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
బడ్జెట్లో స్పేస్ ఇండస్ట్రీకి చేయూతనివ్వాలని భారతీయ ప్రైవేట్ రంగ స్పేస్ పరిశ్రమ కోరుతున్నది. స్పేస్ ఆస్తులను క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వర్గీకరించాలని డిమాండ్ చేసింది. దేశీయ సంస్థల ఉత్పత్తులు, సేవలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్తోపాటు పరిశోధనల అభివృద్ధికి మద్దతునివ్వాలని ఆయా కంపెనీల అధిపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ కూర్పులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆయా విభాగాల కార్యదర్శులు, ప్రధాన ఆర్థిక సలహాదారు కీలకంగా పనిచేశారు. వారందర్నీ పైచిత్రంలో చూడవచ్చు.