Union Budget 2025-26 | పేదలు, మధ్య తరగతి ప్రజలను లక్ష్మిదేవి కరుణించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
‘పేదలు, మధ్య తరగతి ప్రజలకు లక్ష్మీ దేవి దీవెనలు అందించారు. ప్రజస్వామ్య దేశంగా 75 ఏండ్లు పూర్తి చేసుకోవడం గొప్ప గర్వ కారణం. నా మూడో విడుత టర్మ్‌లో తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2047 నాటికి భారత్ స్వాతంత్య్రానికి వందేళ్లూ పూర్తవుతాయి. వికసిత్ భారత్ కావాలన్న లక్ష్యం పూర్తవుతుందని భావిస్తున్నా. జాతికి ఈ బడ్జెట్ నూతన శక్తిని అందిస్తుందని ఆశాభావంతో ఉన్నాను’ అని ప్రధాని మోదీ చెప్పారు.
ధరల పెరుగుదలతోపాటు, వేతనాల పెరుగుదల నిలిచిపోయిన తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. బడ్జెట్లో సామాన్యుడికి, మధ్య తరగతి ప్రజలకు ఆదాయం పన్ను విధానంలో రిలీఫ్ కల్పిస్తారని పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీ సంకేతాలిచ్చినట్లయింది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయం పన్ను చట్టం ప్రకారం రూ.3 లక్షల ఆదాయం వరకూ పన్ను చెల్లించనక్కర్లేదు. రూ.7 లక్షల్లోపు ఆదాయం వరకూ ఐదుశాతం, రూ.10 లక్షల్లోపు ఆదాయం వరకూ పది శాతం, రూ.12 లక్షల్లోపు ఆదాయం వరకూ 15శాతం, రూ.15 లక్షల్లోపు ఆదాయం గల వారికి 20 శాతం, రూ.15 లక్షల పై చిలుకు ఆదాయం గల వారు 30 శాతం ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక నూతన ఆదాయం పన్ను విధానంలో రూ.7 లక్షల వరకూ పన్ను రాయితీ ఉంటుంది.