Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశ పెడతారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ను సమర్పించనున్నారు. రికార్డు స్థాయిలో ఆమె ఏడో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంటులో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తుంది.
‘సోమవారం మధ్యాహ్నం ఆర్ధిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడతాం. కేంద్ర బడ్జెట్ తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ బడ్జెట్ కూడా ఈ నెల 23నే పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. ఈ సమావేశాల్లో ఆరు శాసనసంబంధ, మూడు ఫైనాన్సియల్ బిజినెస్ సంబంధ బిల్లులను ప్రభుత్వం బిల్లులో ప్రవేశ పెడుతుంది’ అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు.
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానాంశం కానున్నది. ఈ బడ్జెట్లో నిరుద్యోగ సమస్యతోపాటు ఇతర ప్రధాన అంశాలపై పోరుకు అనుసరించాల్సిన వ్యూహం వెల్లడిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఎకనమిక్ డివిజన్ సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వే తయారు చేస్తారు. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తోపాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వారు. 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నారు.