ముంబై, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో బాంబే స్టాక్ ఎక్సే ంజ్ (బీఎస్ఈ) నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.25.90 లక్షల కోట్లకుపై గా ఎగిసింది. మంగళవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) మొదలుకానుండగా.. శుక్రవారంతో ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లకు చివరి ట్రేడింగ్ రోజు ముగిసింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో బీఎస్ఈలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల సంపద రూ.25,90,546.73 కోట్లు పెరిగి రూ.4,12,87,646.50 కోట్లకు చేరినట్టు తేలింది. ఇదే సమయంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,763.57 పాయింట్లు లేదా 5.10 శాతం ఎగబాకింది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మాత్రం ఇది తక్కువే. నాడు 14,659.83 పాయింట్లు (24.85 శాతం) పుంజుకున్నది. మదుపరుల సంపద రూ.128,77,203.77 కోట్లు పెరిగింది. ఇదిలావుంటే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఈ ఆర్థిక సంవత్సరం 1,192.45 పాయింట్లు లేదా 5.34 శాతం లాభపడింది. మరోవైపు శుక్రవారం సెన్సెక్స్ 191.51 పాయింట్లు పడిపోయి 77,414.92 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే సెన్సెక్స్ 420.81 పాయింట్లు పతనమైంది. ఇక నిఫ్టీ కూడా 72.60 పాయింట్లు కోల్పోయి 23,519.35 వద్ద స్థిరపడింది.