BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు చవిచూశాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 852.49 పాయింట్లు (1.09 శాతం) నష్టపోయి 77,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 205.05 పాయింట్లు (0.84శాతం) నష్టపోయి 24,173.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒత్తిడిలోనే కొనసాగాయి.
నిఫ్టీ 24,202.35 పాయింట్లతో ప్రారంభంకాగా, ఇంట్రాడేలో 24,134.80 పాయింట్ల కనిష్టానికి చేరింది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చల అంశంలో స్పష్టత లేకపోవడం, హార్ముజ్ దిగ్బంధనం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, బీఈఎల్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్ సంస్థలు లాభాలు పొందాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 103 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఔన్స్ బంగారం ధర 4688 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. 94 మార్క్ దాటి 94.10 వద్ద కొనసాగుతోంది. బుధ, గురు వారాలు కలిపి సెన్సెక్స్ 1,600 పాయింట్లు (2 శాతం) నష్టపోయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి.