BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు లాభాలు పొందడం విశేషం. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 254.36 పాయింట్లు (0.33 శాతం) లాభపడి 77,409.98 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 77.492.33 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 82.30 పాయింట్లు (0.34 శాతం) లాభపడి 24,168 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.33 శాతం, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి.
గత ఐదు సెషన్లలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ఐదు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 4.8 శాతం, నిఫ్టీ 4.3 శాతం లాభాలు పొందాయి. రూపాయి విలువ బలపడి 16 పైసలు పెరిగింది. డాలర్‌తో 94.32 వద్ద రూపాయి కొనసాగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.1 శాతం తగ్గి 77.8 డాలర్ల వద్ద కొనసాగింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ బ్యారెల్ ధర 76 డాలర్ల దిగువకు చేరింది. గురువారం బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ స్టాక్స్‌లో ఎస్బీఐ 1.64 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.419 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.67 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.39 శాతం లాభపడ్డాయి. అయితే, ఐటీ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల బాటలో నడిచాయి. ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా 2.66 శాతం నష్టపోగా, టెక్ మహీంద్రా షేర్లు 1.07 శాతం, టీసీఎస్ షేర్లు 0.82 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 0.41 శాతం నష్టపోయాయి.
సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా ఇండిగో సంస్థ ఈ రోజు భారీ లాభాలు పొందింది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ 2.73 శాతం లాభపడగా, ట్రెంట్ సంస్థ షేర్లు 2.52 శాతం లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, శుక్రవారం నుంచి హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుండటం వంటివి మార్కెట్లు లాభాలబాటలో నడిచేందుకు కారణమయ్యాయి.