Stock Markets | ఆసియా మార్కెట్ల బాటలోనే మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాల్లోనే సాగాయి. ఒకవైపు ధరల పెరుగుదల, వాటి కట్టడికి వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందన్న ఆందోళన మధ్య స్టాక్ మార్కెట్లు కొన్ని రోజులుగా ఒడిదొడుకులకు గురయ్యాయి. కానీ, మంగళవారం ట్రేడింగ్ ఉదయం నుంచే లాభాలతో మొదలైంది. ఆటో, బ్యాంకింగ్, మెటల్స్, రియాల్టీ, ఇన్ఫ్రా తదితర రంగాల షేర్లకు గిరాకీ పెరగడం కూడా కలిసి వచ్చింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 578.5 పాయింట్ల (0.98శాతం) లబ్ధితో 59,720 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 60,106 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 194 పాయింట్ల (1.1 శాతం) లాభంతో 17,816 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 17,919 పాయింట్లకు దూసుకెళ్లింది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.4 శాతం లాభంతో ముగిసాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దన్నుతో స్టాక్స్ దాదాపు మూడు శాతం లాభ పడ్డాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 1.7 శాతం చొప్పున లబ్ధి పొందాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం లాభాలతో సరిపెట్టుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ 59,556.91 పాయింట్ల వద్ద శుభారంభాన్ని అందుకుని ఇంట్రాడే ట్రేడింగ్‌లో 900కి పైగా పాయింట్లు లాభపడింది. 60,105.79 పాయింట్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లి.. ముగింపు సమయానికి 578.51 పాయింట్ల లబ్ధితో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ 17,919.30- 17,744.40 పాయింట్ల మధ్య సాగింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 194 పాయింట్ల లాభంతో 17,816.25 పాయింట్ల వద్ద సెటిలైంది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.79.70 వద్ద నిలిచింది.
మంగళవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో 24 స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లబ్ధి పొందాయి. నెస్ట్లే ఇండియా, ఐటీసీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి నష్టపోయాయి.
యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగింది. పాన్-యూరోపియన్ స్టాక్-600 ప్రారంభంలో ఫ్లాట్‌గా ట్రేడింగ్ సాగినా.. 0.9 శాతం లాభంతో ముగిసింది. ఆసియాలో నిక్కీ, కొస్పీ, ఎఎస్ఎక్స్-200, హాంగ్‌సెంగ్ ఇండెక్స్‌లు 0.4 శాతం నుంచి ఒక శాతం లాభంతో ట్రేడ్ అయ్యాయి.