Crude@ $200 | అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సరికొత్త రికార్డు నెలకొల్పింది. సోమవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 139 డాలర్లు తాకింది. ఇది 2008 తర్వాత అత్యధికం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ముడి చమురు సరఫరాపై అమెరికా, ఈయూ మిత్ర దేశాలు నిషేధం విధించడం, ఇరాన్‌తో అమెరికా ఒప్పందం జాప్యం కావడం దీనికి కారణం.బ్యారెల్ అంటే 158.98 లీటర్లు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్ల మార్క్‌ను దాటొచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది.
సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 139.13 డాలర్లు, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) 130.50 డాలర్లు పలికింది. 2008 జూలై తర్వాత ఇదే గరిష్ఠం. మున్ముందు రష్యా నుంచి విదేశాలకు ముడి చమురు ఎగుమతులు నిషేధిస్తే రోజూ 50 లక్షల బ్యారళ్ల ముడి చమురు కొరత ఏర్పడుతుంది. ఇది మార్కెట్లో అత్యధిక కొరతగా భావిస్తున్నారు.
మరోవైపు గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్లో దేశీయంగా బంగారం ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. వంట నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.