BPCL | కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొత్త ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. క్లీన్ ఎనర్జీ దిశగా భారత్ పరివర్తన చెందుతున్న ప్రస్తుత తరుణంలో బీపీసీఎల్ ఎంపిక చేసిన చివరి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇదే కానున్నది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కోస్తా తీర ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి బోర్డు అనుమతి లభించిందని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో బీపీసీఎల్ వెల్లడించింది.
దీని అంచనా వ్యయం రూ.6,100 కోట్లు ఉంటుందని బీపీసీఎల్ పేర్కొంది. రిఫైనరీ ఏర్పాటు అవసరమైన భూమి గుర్తింపు- స్వాధీనం, డిటైల్డ్ ఫీజబిలిటీ రిపోర్ట్, పర్యావరణ ప్రభావం, ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్, బేసిక్ ఇంజినీరింగ్ ప్యాకేజీ, ప్రాథమిక అధ్యయనం చేపడతామని తెలిపింది. ఈ రిఫైనరీ సామర్థ్యం ఎంత అన్న విషయం గానీ, ఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందన్న విషయం గానీ బీపీసీఎల్ వెల్లడించక పోవడం గమనార్హం. న్యూ ఇంధన వెంచర్లలో భాగంగా కోర్ ఆయిల్ రిఫైనరీ అండ్ ఫ్యుయల్ రిటైలింగ్ బిజినెస్‌లోకి విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.