ముంబై, మే 27: తీవ్ర ఒడిదొడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో పరుగులు పెట్టిన సూచీలు.. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలను చేరాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ తొలిసారి 76,000 పాయింట్లను తాకింది. ఒకానొక దశలో 599.29 పాయింట్లు ఎగిసి గరిష్ఠంగా 76,009.68 వద్దకు వెళ్లి ఆల్‌టైమ్ ఇంట్రా-డే హైని నెలకొల్పింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 153.70 పాయింట్లు ఎగబాకి 23,000 మార్కును మరోసారి అధిగమించి, మొదటిసారి 23,110.80 స్థాయిని టచ్ చేసింది. అయితే మదుపరులు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు క్రమేణా పడిపోతూ నష్టాలకు లోనయ్యాయి. చివరకు సెన్సెక్స్ 19.89 పాయింట్లు తగ్గి 75,390.50 వద్ద, నిఫ్టీ 24.65 పాయింట్లు దిగి 22,932.45 వద్ద స్థిరపడ్డాయి.
ఇక సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 835 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 250 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ కనిష్ఠ స్థాయి 75,175.27గా, నిఫ్టీ కనిష్ఠం 22,870గా ఉన్నది. కాగా, సెన్సెక్స్ తొలిసారి 75,000 మార్కును గత నెల ఏప్రిల్ 9న తాకింది. దీంతో గడిచిన 31 ట్రేడింగ్ రోజుల్లో 1,000 పాయింట్లు పెరిగినైట్టెంది. అంతకుముందైతే 74,000 నుంచి 75,000 స్థాయికి 21 ట్రేడింగ్ సెషన్లే పట్టింది. ఇదిలావుంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ, ఆయిల్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ హెవీ వెయిట్ షేరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ దాదాపు 1 శాతం తగ్గడం ఓవరాల్ ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్టు మెజారిటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీసీ షేర్ల పతనం కూడా దెబ్బతీసింది. ఇక వచ్చే వారం (జూన్ 4న) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉండటంతో మదుపరులు ఒకింత భయాందోళనలకు గురవుతున్నారని, ఇందుకు మార్కెట్ ఒడిదొడుకులే తాజా ఉదాహరణ అని మరికొందరు ఎక్స్పర్ట్స్ ట్రేడింగ్ సరళిని అభివర్ణిస్తున్నారు. సెన్సెక్స్‌లో విప్రో, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఆర్ఐఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ 0.63 శాతం, 0.09 శాతం చొప్పున క్షీణించాయి.
తగ్గనున్న ఎన్ఎస్ఈ టిక్ సైజ్
రూ.250 కంటే తక్కువ ధర కలిగిన అన్ని స్టాక్స్‌కు ఒక పైసా టిక్ సైజ్‌ను పెట్టాలని ఎన్ఎస్ఈ నిర్ణయించింది. జూన్ 10 నుంచి ఈ మార్పు అమల్లోకి రానున్నది. ఇంతకుముందు ఇది 5 పైసలుగా ఉండేది. ద్రవ్యతను పెంచడం, ధర అన్వేషణను మెరుగుపర్చడంలో భాగంగానే ఆయా షేర్లకు టిక్ సైజ్‌ను తగ్గిస్తున్నట్టు ఎన్ఎస్ఈ ఓ సర్క్యులర్‌లో పేర్కొన్నది. టిక్ సైజ్లు అనేవి ప్రతీ నెల చేసే సర్దుబాట్లు, సమీక్షలకు లోబడి ఉంటాయి. ప్రతీ నెల చివరి ట్రేడింగ్ రోజు ముగింపు ధరలపై ఆధారపడి ఉంటాయి. గత ఏడాది బీఎస్ఈ కూడా రూ.100 కంటే తక్కువ ధర కలిగిన అన్ని స్టాక్స్‌కు టిక్ సైజ్‌ను 5 పైసల నుంచి 1 పైసాకు తగ్గించింది.