న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,027 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.540.72 కోట్లతో పోలిస్తే 90 శాతం అధికమని బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. కానీ, సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.12,310.92 కోట్ల నుంచి రూ.11,211.14 కోట్లకు దిగొచ్చినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నికర వడ్డీ ఆదాయం కూడా రూ.3,739 కోట్ల నుంచి రూ.3,408 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. గత త్రైమాసికానికిగాను బ్యాంక్ మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తుల విలువ అడ్వాన్స్‌లో 13.25 శాతం నుంచి 10.46 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. కానీ, నికర ఎన్పీఏ మాత్రం 2.46 శాతం నుంచి 2.66 శాతానికి పెరిగినట్లు తెలిపింది. బ్యాంక్ ప్రొవిజన్ కవర్ రేషియో(పీసీఆర్) 86.86 శాతంగా ఉన్నది.