Stock Markets | ధరలను కట్టడి చేయడానికి వడ్డీరేట్లు పెంచడానికి సిద్ధం అన్న అమెరికా ఫెడ్ రిజర్వు.. వడ్డీరేట్ల పెంపువల్ల ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుంటాయన్న ఆందోళనతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పలు ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంకు గురువారం హెచ్చరించింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 1093.22 (1.82 శాతం) నష్టపోయి 58,840.79 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం 59,934.01 పాయింట్ల వద్ద స్థిర పడిన సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్లో అంత కంటే తక్కువగా 59,585.72 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడే ట్రేడింగ్లో 59,720.56 పాయింట్ల గరిష్టానికి, 58,687.17 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 346.55 (1.94 శాతం) పతనంతో 17,530.85 పాయింట్ల వద్ద స్థిర పడింది. 17,796.80 పాయింట్ల వద్ద మొదలైన ట్రేడింగ్ ఇంట్రాడేలో గరిష్టంగా 17,820.05 పాయింట్లకు, కనిష్టంగా 17,4957.25 పాయింట్ల స్థాయికి పడిపోయింది.
అంతకుముందు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటల సమయానికి 1122.53 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 358.60 పాయింట్ల పతనమైంది. సెన్సెక్స్ 58,785.25 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,518.80 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం నుంచి ఏడు శాతానికి కుదిస్తూ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనాలు వెలువరించడం, ఆగస్టు ద్రవ్యోల్బణం సౌలభ్య స్థాయికి ఎక్కువే నమోదు కావడంతో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఊహాగానాల వల్ల ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది.
నెగెటివ్ సెంటిమెంట్ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత రెండు సెషన్లలో రూ.2,668.19 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈక్విటీ మార్కెట్లలో ఈ నెల 14న రూ.1,397.51, 15న రూ.1270.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. వారం రోజులుగా భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కు తగ్గారు. అయినా ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు రూ.5176 కోట్ల పెట్టుబడులు పెట్టుబడులు పెట్టారు. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 2-4 శాతం మధ్య పతనం అయ్యాయి. మార్కెట్ హెవీ వెయిట్ రిలయన్స్ సైతం రెండు శాతానికి పైగా నష్టపోయింది.